Friday, November 09, 2018

కొత్తకొడలు

ప్రియాతి ప్రియమైన అత్తయ్య గారి పాద పద్మములకు ఆపాద మస్తకపు నమస్కారాలు తెలియజేస్తూ , మీ కొత్తకొడలు వ్రాయునది ఏమనగా
 మీరు కాపురానికి వస్తున్నప్పుడు నాకు చెప్పిన అన్నిటిని తూచా తప్పకుండా పాటిస్తున్నాను.

కొత్తసంసారం పాలు పొంగినట్టు పొంగి పొర్లాలి  అని చెప్పారు. అందుకే రోజుకి రెండు లీటర్ల పాలు పొంగిస్తున్నాను . పొంగి పొర్లగా మిగిలిన పాలతో టీ చేసుకుని తాగుతున్నాం , కాకపోతే రెండు నెలలకే స్టవ్ కమురు కంపు కొట్టటం తో నిన్ననే కొత్త స్టవ్ కొనుకొచ్చాను.

పనీ , పాటా నేర్చుకోమన్నా మీ మాట మీద గౌరవం తో రోజుకి 5 గంటలు , ఏఆర్  రెహ్మాన్ పాటలు వింటూ  ప్రాక్టీస్ చేస్తున్నాను . పాట నేర్చుకోవడం పూర్తి కాగానే పని నేర్చుకోవడం ప్రారంభం చేస్తాను.

మీ అబ్బాయి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించమని చెప్పారు కదా అందుకే, వారి ఆరోగ్య దృష్ట్యా రోజుకి ఒక్కసారి మాత్రమే భోజనం పెడుతున్నాను .

భర్త ని కష్ట పెట్టకూడదు అన్న మీ మాట గుర్తుకొచ్చి ఉదయం మాత్రమే వంట చేయిస్తున్నాను.

చుట్టుపక్కల వారితో జాగ్రత్త అని చెప్పారు గా అత్తయ్య అందుకే నిన్న ఎదిరింటావిడ పలకరించబోతే ముఖం మీదే తలుపులు వేసాను . ఆవిడ ముఖం మీరు చేసిన చపాతీ లా మడిపోయింది .

పొదుపు చేయమన్న మీ మాట తో వారానికి ఒక్క డ్రస్ మాత్రమే కొనుకుంటున్నాను . అలాగే రెండు సినిమాలు మాత్రమే చూస్తున్నాం . ఈ నెల పొదుపు చేసిన డబ్బు తో మీ అబ్బాయి కి కొత్త కర్చీఫ్ కొనిచ్చాను .

పతియే ప్రత్యక్ష దైవం అని చెప్పారు కదా అందుకె నిన్న వైకుంఠ ఏకాదశి అని పూజ చేసి మీ అబ్బాయి కాళ్ళ మీద కొబ్బరికాయ కొట్టాను .పాపం కాలు వేలు చిట్లి రక్తం వస్తే కట్టు కూడా కట్టాను . తొందర్లోనే తగ్గిపోతుంది లెండి

మీరు ఇంకా నాకు ఏమైనా సలహాలు ఇవ్వాలంటే వివరంగా ఉత్తరం వ్రాయగలరు
        ఇట్లు
               మీ ప్రియమైన కుమారుని పాద దాసి
                                           బాలా త్రిపుర సుందరి .

No comments: